చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకరం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక ప్రకారం హైదరాబాద్ లోని 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని తెలిపారు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కుపైగా ఉన్నాయని, హైడ్రా చెరువులను ప్రధానంగా తీసుకుందని వెల్లడించారు.
‘ప్రజల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయి. ఫేజ్-1 లో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఫేజ్-2 లో ఆక్రమణలు చేసి ఇళ్లు కట్టుకున్న వాటిపై దృష్టి ఉంచుతాము. ఫేజ్-3లో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునర్జీవనం కల్పిస్తాం. గొలుసుకట్టు చెరువులన్నీంటిని పునరుద్ధరిస్తాం. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దు.’ అని రంగనాథ్ సూచించారు.