తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తుపాను వేగంతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు హాజరై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన మాటలతో విరుచుకుపడ్డారు.
“మోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదలకు 2000 పెన్షన్ ఇస్తే, రుణమాఫీ చేస్తే, ఉచిత కరెంట్ ఇస్తే మోడీకి నచ్చదు. కానీ రూ.16.50 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మోడీకి నచ్చుతుంది. అమిత్ షా పార్లమెంట్‌లో అంబేడ్కర్ అనడం ఫ్యాషన్ అయ్యింది అని అహంకారంగా మాట్లాడారు. అంబేడ్కర్ మంచి చేశారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతారు. బీజేపీ వాళ్లలా మతం మతం అంటూ మతం పిచ్చి పట్టించి దేశాన్ని గబ్బు లేపలేదు.” అని కేటీఆర్ విమర్శించారు.