తెలంగాణ రాష్ట్రం జూన్ 02, 2014న అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రం అవతరించినప్పటి నుంచి డిసెంబర్ 05, 2023 వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా కొనసాగారు. డిసెంబర్ 06, 2023 నుంచి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు.
జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ గవర్నర్ రాధా కృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో కలువనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఏర్పాట్ల గురించి వివరించనున్నారు.