తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో భారీగా పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడి సాయం రైతుబంధు అందక, రుణ మాఫీ విషయంలో గందరగోళంతో తెలంగాణలో భారీగా పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15.30 లక్షల ఎకరాల మేర పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు సమాచారం. ఇందులో 2.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు తగ్గిందట.
గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోవడం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. పంట వేసే ముందు పెట్టుబడి సాయం రైతుబంధు ఇవ్వలేకపోవడం, గత నెల వర్షాలు లేకపోవడం, చెరువులు ఎండిపోయి ఉండడంతో తెలంగాణలో భారీగా పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు చెబుతున్నారు. వరి బోనస్ పై మాట మార్చడంతో 66 లక్షల్లో వరి పంట సాగు చేస్తారని అంచనా వేయగా.. కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే వరి సాగు జరిగింది. ఇక చెరువులు అలుగు పోసే సమయంలో ఇంకా రాష్ట్రంలోని 15,131(61.34%) చెరువుల్లో 25% కంటే తక్కువే నీళ్లు ఉన్నాయి.