పట్టణాలు, గ్రామాల్లో తాగునీటిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.
ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ పెరిగిన అవసరాలకు సరిపోవటం లేదని, భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశిం చారు.