తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను నాలుగు దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన అయిదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.