సిద్ధిపేట, సిరిసిల్ల ఈ నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..ఎందుకంటే ఈ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించేది హరీష్ రావు, కేటీఆర్ కాబట్టి..వీరు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్నారు. ఈ రెండు చోట్ల ఆ ఇద్దరినీ ఓడించడం జరిగే పని కాదు..అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీలని తగ్గిస్తారా? అనేది చూడాలి.
మొదట సిద్ధిపేట గురించి మాట్లాడుకుంటే..1985 నుంచి 2004 వరకు ఇక్కడ కేసీఆర్ వరుసగా గెలిచారు. 1985 టూ 1999 వరకు టిడిపి నుంచి…2001లో టిఆర్‌ఎస్ పెట్టి..ఉపఎన్నికలో గెలిచారు. 2004లో గెలిచారు. అయితే అప్పుడు కరీంనగర్ ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2004 సిద్ధిపేట ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ నుంచి హరీష్ పోటీ చేసి గెలిచారు. అక్కడ నుంచి హరీష్ విజయాలు కొనసాగుతున్నాయి. 2008 ఉపఎన్నిక, 2009 ఎన్నికలు, 2010 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు.
ఇక గత ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో అత్యధిక మెజారిటీ హరీష్ రావుకు వచ్చింది. దాదాపు లక్షా 18 వేల ఓట్ల మెజారిటీతో హరీష్ రావు గెలిచారు. అయితే ప్రతి ఎన్నికకు హరీష్ మెజారిటీ పెరుగుతూ వస్తుంది. మరి ఈ సారి పెరుగుతుందా? అంటే చెప్పలేం. బిజేపి, కాంగ్రెస్ రేసులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సారి హరీష్ మెజారిటీ కాస్త తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అటు సిరిసిల్ల చూస్తే 2009 ఎన్నికల్లో తొలిసారి కేటీఆర్ బరిలో దిగి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత 2010 ఉపఎన్నికలో సత్తా చాటారు. ఇక 2014లో భారీ మెజారిటీ దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో దాదాపు 89 వేల ఓట్ల మెజారిటీతో కేటిఆర్ గెలిచారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆ మెజారిటీ పెరుగుతుందా చెప్పలేని పరిస్తితి. ఈ సారి కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. చూడాలి మరి కేటిఆర్, హరీష్ మెజారిటీలు తగ్గుతాయో లేదా పెరుగుతాయో.