బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని.. రీసర్వే చేయడంతో మరో 1.5 లేదా 2 శాతం బీసీల జనాభా పెరుగుతుందని తెలిపారు.
మొత్తం బీసీల జనాభా దాదాపు 48 శాతం ఉంటుందని అంచనా వేశారు. 48 శాతం బీసీలు ఉంటే.. ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క అంశంపై అయినా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు రంగాలకు సంబంధించి వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లీంలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లింలకు మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లీంల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లీంల పేరు చెప్పి ఆయా వర్గాల మధ్య పంచాయతీ పెట్టవద్దని సూచించారు.