కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ కొనసాగుతోంది. ఈ కమిషన్‌లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు, ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి వారిని విచారణకు పిలవనున్నట్లు సమాచారం.
జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. కొద్దిరోజుల్లో ఆర్థికాంశాలపై విచారణ ప్రారంభించనున్న ఈ కమిషన్.. ఇప్పటికే డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజినీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది. ఇక త్వరలోనే బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీరేట్లపై విచారణ చేపట్టనుంది.