రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉపముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రికానీ, సీనియర్ మంత్రి కానీ రేస్‌లో ఉంటారు. ప్రస్తుతం ఉప ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరికి ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నది. కానీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలో తానే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్‌ఫుల్ మంత్రిని అని చెప్పుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశం లో కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారు ..భట్టి కి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు. కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదు. కేటీఆర్ ,హరీష్ రావు లు కృష్ణార్జునులు ..వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి అన్నారు.