దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నీటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీకి స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ రాజకీయ నేత, దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ.. గురువారం రోజున రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా మల్కపేట జలాశయంతో పాటు ఆ పరిధిలోని కాల్వలకు ఈ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగు, తాగునీరు అందిస్తున్న మధ్యమానేరు నుంచి ఎగువ మానేరు వరకు జలాశయం, కాల్వలకు చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెడుతూ ఈ విధంగా కేసీఆర్ నిర్ణయించారు.
స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ మొదటితరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర రావు అని సీఎం కేసీఆర్ అన్నారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి ఎత్తిపోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వరరావు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. ఆనాటి చెన్నమనేని రాజేశ్వరరావు ఆకాంక్షలను ప్రతిఫలించేలా.. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు.