తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ కే వస్తున్నాయన్నారు. దళితులను సీఎం చేస్తానని.. దళితులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి కేసీఆర్ రారు.. మజ్లీస్ దావత్ లకు మాత్రం వెళ్తారన్నారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల జనాలు అమరవీరులు వదిలిన బాణం ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలవడని.. ఈటల రాజేందర్ గజ్వేల్ కి రాగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండన్నారు కిషన్ రెడ్డి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోతాడన్నారు.
ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈరోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని.. భూములు, బిల్డింగ్ లు కొనాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాన అవినీతిమయం అయిందని.. కల్వకుంట్ల కుటుంబం పాలైందని ఆరోపించారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్ లోకి పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నయంగా బీజేపీ నిలబడుతుందన్నారు.