తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సమయంలో.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఇప్పటికే కేసీఆర్‌పై తానూ పోటీ చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఓవైపు కేసీఆర్.. మరోవైపు రేవంత్‌తో ఇప్పటికే కామారెడ్డి రాజకీయం రాజుకుంటుంటే.. మరోవైపు లబాన లంబాడీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ.. లేదంటే నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. ఇంకోవైపు ఇప్పుడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు నామినేషన్లకు సిద్ధమవుతుండటం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
కొత్త మాస్టర్ ప్లాన్‌లో 8 విలీన గ్రామాలను కలుపుకొని 1,195 ఎకరాల్లో కామారెడ్డి పట్టణాభివృద్ధి పేరుతో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయగా.. దీనికి వ్యతిరేకంగా రైతులు ఐక్య కార్యాచరణ సమితీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. దీనిపై రైతులు పోరాటం చేయగా దిగొచ్చిన మున్సిపల్‌కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే జీఓలో మాత్రం వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగించకపోవడంతో ఇప్పుడు మరోసారి రైతులు నిరసనకు దిగుతూ కేసీఆర్‌పై పోరుకు సిద్ధమవుతున్నారు.