కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలో ఉన్న అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మాల్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా షాపింగ్ మాల్ నాలుగంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి. మంటల్లో మాల్‌లోని సామగ్రి కాలి బూడిదైంది. స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది.
అర్ధరాత్రి నుంచి ఘటనాస్థలిలో మంటలు అదుపుతెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మిగిలిన రెండు అంతస్తుల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. జేసీపీ సాయంతో షాపింగ్ మాల్ షట్టర్లను తొలగించి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో రహదారులను బ్లాక్ చేశారు. పరిసరాల దుకాణాల యజమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఆరా తీస్తున్నారు.