ముదిరాజ్ కులస్తులకు బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముదిరాజ్ వర్గాన్ని కించపరుస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇంత చర్చ జరుగుతున్నా బిఆర్ఎస్ పార్టీలో చలనం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.
బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా జోగు రామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడం అభినందించదగిన విషయమని అన్నారు. ఇక కర్ణాటక ఫలితాల తరువాత బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్యాయం కాంగ్రెస్ గా మారిందని అన్నారు. మరికొద్ది నెలల్లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని.. ఇప్పటికే పార్టీ అభ్యర్థులు 60 స్థానాలకు ఖరారు అయ్యారని తెలిపారు. ఎవరి నియోజకవర్గంలో వారు పని చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పారు.