హైదరాబాద్ చుట్టూ ఉన్న వందల ఎకరాల పై కేసీఆర్ కన్ను పడిందని ఆరోపించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ పేదల భూములను గుంజుకుని, అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం ఇచ్చిన భూములను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా గుంజుకుంటున్నారని ఆరోపించారు.
కెసిఆర్ తన ఎనిమిది ఏళ్ళ పాలనలో ఒక్క ఎకరా అసైన్డ్ భూమి కూడా ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయలేదని అన్నారు. అసైన్డ్ భూముల విషయంలో పేదలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు ఈటల రాజేందర్. పేదలతో పెట్టుకుంటే మాడి మసైపోతావ్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. హైదరాబాదులో భూములను అమ్మి, వచ్చిన డబ్బులతో రానున్న ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నట్లుగా తెలిపారు.
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పొడు భూముల సమస్యలను పరిష్కరిస్తారని మూడుసార్లు చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు గిరిజనులపై చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారని, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈటెల రాజేందర్.