కెసిఆర్ – కేఏ పాల్ ఇద్దరు ఒకటే: రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కెసిఆర్ ఏం చేసినా మునుగోడులో గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ – కేఏ పాల్ ఇద్దరు ఒకటేనని అన్నారు. కెసిఆర్ ఒక నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ పై తప్పుడు ఆరోపణలు చేసి మంత్రివర్గం నుంచి తొలగించారని విమర్శించారు. కెసిఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలవి బానిస బతుకులుగా మారాయని అన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మూడున్నర ఏళ్లుగా ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప ఇతర నియోజకవర్గాలలో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఉప ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతోనే గ్రామాలలో ప్రచారానికి ఎమ్మెల్యేలు, మంత్రులను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.