రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.
గతంలో ఒక్క నిమిషం నిబంధన ఉండగా, దానిని సడలించింది ఇంటర్ బోర్డు. ఉదయం 8.45 కల్లా ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలని సూచించిన ఇంటర్ బోర్డు.. ఐదు నిమిషాల పాటు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలిపింది. కాగా, ఇటీవల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యతో సడలింపు ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేని కారణంగా కొంత మంది విద్యార్థులు రాలేకపోయారు. ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఒక్క నిమిషం నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.