కోదండరామ్ కు కీలక పదవి..?

-

తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన టీమ్ ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో అనుభవజ్ఞులకు పట్టం కట్టిన రేవంత్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించే నియామకాల పైన కూడా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి నియామకం కూడా పూర్తి చేశారు.ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు సీఎం సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించ వచ్చు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ పాలనలో కోదండరామ్ సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. కోదండరామ్‌ కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వ్యక్తే. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబరాల్లో రేవంత్ ఆరోపించారు.కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని అదే సందర్భంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోదండరాం కు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. రేవంత్‌ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే కోదండరామ్‌కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సలహదారులకు ఇప్పటికే ఉద్వాసన పలికారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో కోదండరాం కు అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్‌ కావడానికి దోహదపడుతుందని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ బాధ్యతల పైన చర్చ సాగుతోంది.ఈ రెండు పదవుల్లో ఒకటి కోదండరామ్ కు ఖరారు కావటం ఖాయంగా కనిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ నియామకాల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా సీఎం కసరత్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version