బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు ఇటీవలే కేంద్ర మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖను కేటాయించగా, బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్ 13వ తేదీన) కేంద్ర మంత్రులుగా ఈ నేతలు బాధ్యతలు స్వీకరించనున్నారు. క్యాబినెట్ హోదాలో బొగ్గు, గనులశాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డి దిల్లీలోని శాస్త్రిభవన్ ఏ బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్‌లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తనకు బొగ్గుగనుల శాఖ కేటాయించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. విద్యుత్ కోతల్లేని దేశాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారన్న కిషన్‌రెడ్డి, బొగ్గు, గనుల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.