కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం. భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్. యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందని అశ్విని వైష్ణవ్ తో చర్చించారు కోమటి రెడ్డి.
యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.