తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇవాళ మంచి రోజు కావడంతో చాలా మంది నేతలు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలక నేతలు నామినేషన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఉండగా ఇటీవల ఓ యువకుడి చేతిలో ఆయన కత్తిపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు శస్త్రచికిత్స జరిగడంతో గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేసేందుకు.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చారు. దుబ్బాకలో అంబులెన్స్ దిగిన తర్వాత వీల్‌చైర్‌లో రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు. దాడి తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకున్నారు.