దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఈనెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి దిల్లీకి తరలించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆమెను శనివారం ఉదయం రౌజ్‌ఎవెన్యూలోని ఈడీ, సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారు పదిరోజుల కస్టడీకి అడగ్గా న్యాయమూర్తి ఏడు రోజుల కస్టడీకి అనుమతించారు.
ఈ నేపథ్యంలో కవితను కలిసేందుకు ఇవాళ బీఆర్ఎస్ నేతలు దిల్లీకి పయనం కానున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ హస్తినకు బయల్దేరనున్నారు. వీరంతా ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవనున్నారు. అదే విధంగా ప్రముఖ న్యాయవాదులను కూడా కలిసే అవకాశమున్నట్లు సమాచారం.