తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారాన్ని షురూ చేసిన గులాబీదళం.. ప్రచారంలో రోజురోజుకు జోష్ చూపిస్తోంది. ఓవైపు సీఎం కేసీఆర్, మరోవైపు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు.. ఇంకోవైపు నియోజకవర్గాల్లో అభ్యర్థులు బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంలో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.
ఇంకోవైపు ఇంటర్వ్యూలు, విద్యార్థులు-ఉద్యోగులు-మహిళలతో మాటమంతీ, మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి అన్ని మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటున్నారు కేటీఆర్. ప్రజలు రిస్క్ తీసుకోరని.. ఈసారి కూడా అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటలకు వరకు ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. మొదటగా దుబ్బాకలో మొదలుపెట్టి.. ముస్తాబాద్ మండలం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు.