తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల ఖరారును ఫైనల్ చేయలేదు సీఎం కేసీఆర్.
ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన జనగాంలో ఇప్పుడు ఇద్దరూ నేతల మధ్య అగ్గి వేస్తే భగ్గుమన్నట్టు ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు ప్రకటించకుండా సీఎం నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి జనగాం నియోజవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనగామ శివారులోని ఓ కల్యాణ మండపంలో పల్లా అనుచరులు సమావేశమైనట్టు సమాచారం. జనగాంలో రహస్య సమావేశాలకు తెరదించాలని ఆదేశించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయం తెలుసుకుని రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యకర్తల సమావేశానికి పల్లా దూరంగా ఉన్నారు. దీంతో అర్ధాంతరంగా కార్యకర్తల సమావేశం ముగిసిపోయింది. కేటీఆర్ ఇక్కడ టికెట్ ఎవ్వరికీ ఇస్తాడో వేచి చూడాలి మరీ.