సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ చూస్తున్నాయి : కేటీఆర్

-

సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ చూస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సింగరేణిని కాపాడేందుకే కేసీఆర్‌ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్త ప్రాజెక్టు తేవాల్సింది పోయి.. ఉన్నవాటినే అమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు మీరిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదా? అంటూ ప్రశ్నించారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటాం అని కేసీఆర్‌ అన్నారని.. 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని ధ్వజమెత్తారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని చెప్పారు.

“బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో రేవంత్‌ రెడ్డి మోదీకి లేఖ రాశారు. ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారు. గుజరాత్‌లోనూ గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారు. సింగరేణికి మాత్రం బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనాలంటున్నారు. అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లింది. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకే వేలంలో పాల్గొనాలని చెబుతున్నారు. బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుంది.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version