మహబూబ్​నగర్ పర్యటనలో మోదీ.. ‘పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా’ ప్రకటించాలి : కేటీఆర్

-

అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇచ్చిన మాట తప్పి మళ్లీ ఎలా వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓట్ల వేటకు తెలంగాణ బయలుదేరిన ప్రధాని మోదీ.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. అదే విధంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలుగా కేటాయించాలని కోరారు.

తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఎందుకు అంత కక్ష అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంపై విషపు మాటలు చిమ్ముతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ని నమ్మి ఓటేస్తే మూడు గంటల కరెంటు, తాగునీటి తన్లాటలు.. ఏడాదికో సీఎం,  కుంభకోణాలు గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా ఇచ్చేందుకు సంతకం పెట్టడానికి చెయ్యి రావడం లేదని ఆక్షేపించారు. దిల్లీలో తెలంగాణ ఎంపీలు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news