రేపు మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ తర్వాత అన్నారంలో పర్యటిస్తామని తెలిపారు. అనంతరం అన్నారం దగ్గర ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు. ప్రజెంటేషన్ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తామని వెల్లడించారు. నీటిపారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్తామన్న కేటీఆర్ మొత్తం 200 మంది ప్రతినిధులతో వెళ్తున్నట్లు వివరించారు.
“మేడిగడ్డలో రోజుకు 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఇటువంటి ఘటనలు మొదటిది కాదు. కానీ చివరిది కావాలని కోరుకుంటున్నాను. ఇటువంటివి జరిగినపుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. 83 రోజుల్లో ఆరోపణలు, శ్వేత పత్రాలు, కాలయాపన తప్ప మరమ్మత్తులపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. అంశాలను ఇంకా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సమస్యను గుర్తించి ప్రభుత్వం పరిష్కరించాలి. పోటీగా మేము పాలమూరు పోతామని చెప్పడం దృష్టి మరల్చడమే. మార్చ్ 31 తర్వాత నీరు ఇచ్చే పరిస్థితి లేదు. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.” అని కేటీఆర్ అన్నారు.