చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అంటూ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు.. ఇదేం రెండునాల్కల వైఖరి..! ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన.. అంటూ రేవంత్ పై ఆగ్రహించారు. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అంటూ ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదు..వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అన్నారు.
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్” అని చురకలు అంటించారు. అధికారిక గీతంలో కీర్తించి..అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..?? అని ఫైర్ అయ్యారు.
చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్ అన్నారు. కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం అని పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని పేర్కొన్నారు.