జన్ కీ బాత్ వినడు.. మన్ కీ బాత్ మాత్రమే చెప్తాడు – మోడీపై కేటీఆర్ సెటైర్స్

ప్రెస్ మీట్ పెట్టడు.. జన్ కి బాత్ వినడు.. మన్ కి బాత్ మాత్రమే చెప్తాడంటూ ప్రధాని నరేంద్ర మోడీ పై సెటైర్లు వేసారు మంత్రి కేటీఆర్. గోల్ మాల్ గుజరాత్ మోడల్ ను చూపెట్టి అధికారంలోకి వచ్చి ఈ ఎనిమిది ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. మోడీ దివాలాకోరు, పనికిరాని ప్రధాని అంటూ మండిపడ్డారు. 45 సంవత్సరాల లో అత్యధిక నిరుద్యోగం భారతదేశంలోనే ఉందన్నారు. 2022 వరకు అందరికీ ఇల్లు ఇస్తానన్నాడు కానీ.. 435 కోట్లతో ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుంటున్నాడని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిరంగంలోనూ విఫలమైందన్నారు మంత్రి కేటీఆర్. భారత రాష్ట్ర సమితి రూపంలో ఈ సమస్యలకు మేము పరిష్కారం చూపిస్తామన్నారు. “ప్రతి ఒక్కరికి తాగునీటిని అందిస్తాం. ఉచితంగా కరెంటు అందిస్తాం. దళితులను వ్యాపారవేత్తలను చేస్తాం” అన్నారు. ఎవరు ఏం తింటున్నారు, ఎవరు ఏం ధరించారు అన్నవి మాత్రమే చర్చకు వస్తున్నాయన్నారు. బిజెపి ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసిందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.