తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా.. నార్లాపూర్ పంప్ హౌస్‌లో సిద్ధమైన మోటారుకు నీటిపారుదల శాఖ అధికారులు విజయవంతంగా డ్రై రన్ పూర్తి చేశారు. 15 రోజుల్లో వెట్ రన్‌ను పూర్తిచేసి…. శ్రీశైలం వెనక జలాల నుంచి కృష్ణా జలాలను నార్లాపూర్ జలాశయానికి ఎత్తిపోయనున్నారు. డ్రై రన్ విజయవంతం అవ్వడం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆవిష్కృతమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో తెలంగాణ జలవిజయ పతాకం సగర్వంగా ఎగురుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టు పంపు డ్రైరన్ విజయవంతమైన తరుణంలో ఆయన ఎక్స్(ట్విటర్) ద్వారా స్పందించారు. నీటి కోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం అయిందని ట్వీట్ చేశారు. తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరంగా అభివర్ణించారు. ‘అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ… కుట్రలను, కేసులను గెలుస్తూ.. జలసంకల్పంతో అనుమతులు సాధించి దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతున్నది… బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్ళందించనున్నది ఇది తెలంగాణ జలశక్తి. ఇది కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!
సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.
ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ…
కుట్రలను, కేసులను గెలుస్తూ..
జలసంకల్పంతో… pic.twitter.com/qBmu9SHyo7— KTR (@KTRBRS) September 4, 2023