వనపర్తి జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. సంకిరెడ్డిపల్లిలో ఆయిల్ పామ్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. తెలంగాణ సాధించిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి గురించి మాట్లాడారు. అదే విధంగా రాష్ట్రం సాధించిన తర్వాత పాలమూరులో జరిగిన అభివృద్ధిపై ప్రసంగించారు.
వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో సాగు లాభాల పంట పండిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పునరుద్ఘాటించారు. వరి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్ పండించాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్‌కు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని వెల్లడించారు.
’20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి.. ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్‌ను సాగు చేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరిస్తుంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ఆయిల్ పామ్ రైతులు ప్రీయూనిక్ కంపెనీకి అమ్ముకోవచ్చు. పంట నష్టం కాకుండా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.’ అని కేటీఆర్ తెలిపారు.