నేడు వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీయార్ ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,  గంగుల కమలాకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి తొలత కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం పెద్దపమందడి మండలం బుగ్గపల్లి తండాలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం, రాజపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు.

ఆ తర్వాత వనపర్తి పట్టణంలోని  సురవరం సాహితీ కళాభవనం, సురవరం ప్రతాప్ రెడ్డి జిల్లా గ్రంథాలయం, ఆధునాతన సమీకృత మార్కెట్, షాదీఖానా, రాక్ గార్డెన్, మట్టి పరీక్షా కేంద్రం, జంతు సంరక్షణ కేంద్రం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను ఆయన ప్రారంభిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళశాల, ఐటీ హబ్, జూనియర్ కళాశాల భవనం, పాలిటెక్నిక్ కళాశాల పునరుద్ధరణ పనులు, బాలుర, బాలికల వసతి గృహాలు, వనపర్తి బైపాస్, వనపర్తి- పెబ్బేరు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇవాళ ఒక్కరోజే సుమారు 669కోట్ల  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కేడీయార్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేటీయార్ వనపర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. అనంతరం కేటీఆర్ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.