కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేమి చేస్తారనే కేసీఆర్‌ను ఓడించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐతో పొత్తు కలిసి వచ్చిందని తెలిపారు. టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయని వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ గత సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఊపిరి ఆడని నిర్బంధాలు జరిగాయని అన్నారు. బంగారు తెలంగాణను చేస్తానన్న కేసీఆర్ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు. నిర్భందాలను సహించబోమని తెలంగాణ ప్రజానీకం స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు.
మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక శాఖలో వందల కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని తెలిపారు. లిక్కర్ కేసులో సిసోడియా జైలులో ఉంటారా.. ఇదే కేసులో ఉన్న కవిత, వైసీపీ నేతలు బయట ఉంటారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ నిలదీశారు.