మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఇవాళ్టి నుంచి మొదలుకొని నెల రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా జరగనున్నాయి. వైభవంగా సాగే ఈ జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు.
కొండపై కొలువుదీరిన కురుమూర్తి స్వామిని సేవించినా.. అంగరంగ వైభవంగా జరిగే ఉద్దాల ఉత్సవంలో స్వామి వారి పాదుకలను దర్శించినా.. సకల బాధలు తొలగడంతో పాటు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. జాతర ముఖ్య ఘట్టాలైన అలంకరణ ఉత్సవం, ఉద్దాలోత్సవం ఈ నెల 30, 31 జరగనున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు హాజరవుతుంటారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తలనీలాల మండపాన్నిసిద్ధం చేశారు. ప్రస్తుత 40 మరుగుదొడ్లతో పాటు, మొబైల్ మరుగుదొడ్లు సిద్ధం చేశారు. దాసంగాలు పెట్టేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు.