వలస వాదుల విష కౌగిలిలో నగిలిపోయిన తెలంగాణను కాపాడుకోవడం కోసం తాను ఒక్కడిగా 25 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బయలుదేరానని పేర్కొన్నారు కేసీఆర్. ఆ సమయంలో పుట్టిన గులాబీ జెండాను ఎందరో ఎగతాళి చేశారని.. వెటకారంగా మాట్లాడారని తెలిపారు. అనేక మంది త్యాగాలు ఉద్యమాలతో ముందుకు సాగినట్టు వివరించారు. కులం, మతం, మనుషుల కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే పార్టీ పుట్టిందన్నారు.
ఆనాడు, ఈనాడు, ఎప్పుడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 1956లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపింది జవహర్ లాల్ నెహ్రు అని పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని చెప్పి.. ఆంధ్రలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కాగానే వెనక్కి తగ్గారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పుట్టిన తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని చెప్పారు. గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ వాళ్లను మించిన వాళ్లు లేరన్నారు కేసీఆర్.