అడవులను నరికేసి వాటి స్థానంలో ఎత్తైన భవనాలు నిర్మిస్తూ వన్యప్రాణాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాం. అందుకే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో కోతుల బెడద, ఎలుగు బంట్ల సంచారం, చిరుత, పులుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా చిరుత సంచారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పలు ప్రాంతాల్లో పశువులపై, మనుషులపై దాడులు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఘాన్సిమియగూడలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి సమయంలో చిరుత సంచరించినట్లు సీసీటీవీ విజువల్స్లో రికార్డయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అయితే అందులో కనిపించిన జంతువు చిరుతనో లేక ఇంకేదో నిర్ధారించాల్సిన అవసరం ఉందని, ప్రాథమికంగా చిరుతే అన్న అభిప్రాయానికి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతను బంధించేందుకు మూడు బోన్లతో పాటు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.