బుధవారం మెదక్ లోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు చెప్పారన్నారు. హైదరాబాద్ కి గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు.
ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా..? అని ప్రశ్నించారు. రైతు భీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెసోళ్లు అసెంబ్లీలో అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసోళ్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
తెలంగాణ కోసం తాను మెదక్ జైల్లో మూడు రోజులు ఉన్నానని చెప్పుకొచ్చారు హరీష్ రావు. తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపిద్దామన్నారు. మెదక్ ఎంపీ బిఆర్ఎస్ పార్టీ గెలవడం పక్కా అన్నారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదామన్నారు.