తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రానందుకు కృంగిపోవల్సిన అవసరం లేదని, రాబోయే పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు హరీష్ రావు హాజరై మాట్లాడుతూ.. సంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాలేదన్నారు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దామని వారిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు సూచించారు. రానున్న రోజుల్లో స్థానిక పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయన్నారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని మనం ధైర్యం కోల్పోవద్దన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షమేనని అన్నారు.