నెలాఖరులోపు 1.50 లక్షల లోపు రుణమాఫీ పూర్తి – హరీష్‌ రావు

నెలాఖరులోపు 1.50 లక్షల లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. తాజాగా బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ…వివిధ కారణాల వల్ల రైతుల అకౌంటు క్లోజ్ కావడం, ఒక బ్యాంకు ఇంకో బ్యాంకులో మెర్జ్ కావడం, బ్యాంకుల పేరు మారడం తదితర కారణాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల నుండి 12,000 మంది, సిద్దిపేట జిల్లాలో 638 రైతుల అకౌంట్లు దొరకడం లేదన్నారు.

నంగునూరు మండలం పాలమాకులలో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో కలిసిపోవడం వలన నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ ఆగిందని వెల్లడించారు. బ్యాంకర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారుల సహకారంతో సంబంధిత రైతులను గుర్తించాలి, ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు రైతులకు రుణమాఫీ జరిగేలా బ్యాంకర్లకు సహకరించాలి.

లీడ్ బ్యాంక్, సిద్దిపేట సహాయంతో జిల్లా స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరిస్తారని హమీ ఇచ్చారు. ఇప్పటివరకు 1 లక్ష 10 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీ జరిగింది. వారం రోజుల్లో 1 లక్ష 30 వేల రూపాయలకు రుణమాఫీ జరుగుద్ది అందుకు 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు.నెలాఖరులోపు 1 లక్షల 50వేల లోపు రుణమాఫీ పూర్తి చేస్తాం. మిగిలిన పంట రుణాల మాఫీ ఖాతాలు మాఫీ చేయబడతాయని వెల్లడించారు హరీష్‌ రావు.