రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్ రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్ జయానగర్ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.
తాను వేరే పార్టీలో చేరేది లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డిపై తొడ గొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరంగానే చేసినవేనని.. వ్యక్తిగతంగా కాదని తెలిపారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగేవారమని చెప్పుకొచ్చారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు.