ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మరోసారి మాట్లాడారు. వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారం కావడంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో వెంటనే అమలు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి న్యాయమూర్తికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 0ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని వాపోయారు. వర్గీకరణకు మద్దతుగా నిలబడిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలియజేశానని మందకృష్ణ చెప్పుకొచ్చారు.