మంగళవారం చత్తీస్గఢ్ లోని దంతేవాడ – బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ జిల్లా లోహగావ్, వురంగేల్ అడవుల్లో ఆండ్రీ గ్రామం వద్ద 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్పిఎఫ్, డిఆర్జి దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.
ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని చత్తీస్గడ్ ప్రభుత్వం ధృవీకరించింది.
కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదాపై సుమారు 25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల మీడియా కార్యదర్శిగా ఉన్న జగన్.. పత్రికా ప్రకటనలన్నీ ఆయన పేరు మీదనే విడుదల అయ్యేవి. ఈయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం. జగన్ 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు.