కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. బుధవారం విజయవాడలోని ఆర్ఆర్ పేటలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆ గేట్లను ఎవరు ఎత్తారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని.. వాలంటీర్లను ముందుగానే అప్రమత్తం చేశామన్నారు.
కానీ తుఫాను వస్తుందని ముందస్తు సమాచారం ఉన్న ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి ఉంటే వరదలు తలెత్తేవి కావన్నారు జగన్. ప్రజలపై చంద్రబాబుకు కనీస కనికరం కూడా లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
పాలనలో వైఫల్యం కారణంగానే విజయవాడ ను వరదలు ముంచెత్తాయన్నారు. చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి వల్లే నేడు 32 మంది మరణించారని చెప్పారు. చంద్రబాబుకు తన ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ప్రజల కోసం కలెక్టరేట్లో ఉంటున్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారని మండిపడ్డారు.