MBS జువెల్లర్స్ అధినేత సుఖేష్ గుప్తా ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈడీ దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు సూచించడంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. MMTC సంస్థను మోసం చేశారనే కేసులో సుఖేష్ గుప్తాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తుపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో ఈడీ అధికారులు విచారణ కొనసాగించనున్నారు.
2005 నుంచి 2011 వరకు MBS జువెల్లర్స్, దాని అనుబంధ సంస్థలు కలిసి MMTC నుంచి భారీగా బంగారాన్ని అరువుగా తీసుకున్నారు. దాదాపు 500కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వజ్రాభరణాలను ఎంఎంటీసీ నుంచి ఎంబీఎస్ కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో ఎంఎంటీసీకి నష్టం వాటిల్లింది. 200కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీసీకి చెందిన కొంత మంది అధికారుల అండతో ఎంబీఎస్ జువెల్లర్స్ అధినేత సుఖేష్ గుప్తాకు మోసానికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.