కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ తొలి సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఈ నేపథ్యంలో ఎవర్ని ఎన్నుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చర్చకు తాజాగా తెర దించింది నూతన సర్కార్.
తెలంగాణ నూతన శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రతిపాదించింది . రేపు ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అక్బరుద్దీన్ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.
అయితే సాధారణంగా ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారన్న విషయం తెలిసిందే. అలా చూసుకుంటే ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్కు చెందిన నేతలు కూడా ఉన్నారు. అయినా తాజాగా అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక చేశారు.