కాంగ్రెస్ హామీలను నమ్మి మోసం పోకూడదని మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్ లో రెండో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వాలున్నాయా ? అని ప్రశ్నించారు. కొత్త లింక్ రోడ్లు, బ్రహ్మాండమైన నాలాలు నిర్మిస్తున్నాం. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోకూడదని ప్రజలకు సూచించారు మంత్రి కేటీఆర్. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చి హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. ప్రజలు తొందరపడొద్దని.. ప్రజలు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు.
వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్ చెబుతారని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి. ఖైరతాబాద్ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లు. కరెంటు గోస చెప్పక్కర్లేదు. అపార్ట్‌మెంట్ కిందకు వెళ్తే డీజిల్ కంపుతో ముక్కులు పగిలిపోయేవి. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్ స్టాల్, జిరాక్స్ సెంటర్లు నడుపుకోలేని అవస్థ. గణేశ్ పండగ వచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ.’ ఉండేవని గుర్తుచేశారు. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.