భూసంస్కరణలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకునిచ్చేది.. బువ్వ పెట్టేది భూమే అన్నారు. తాజాగా అసెంబ్లీలో భూమి హక్కులు,సంస్కరణలపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. జాగీర్లు రద్దు చట్టంతో దున్నేవాడికే భూమి దక్కింది. ఇందిరాగాంధీ భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భూ సంస్కరణలను తీసుకొచ్చారు. భూదాన ఉద్యమం కూడా తెలంగాణలోనే పుట్టింది.
ధరణీ పోర్టల్ ద్వారా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులకు పట్టాలు వారి ఆలోచన పరంగా తీసుకురావాలి. మోసపూరితంగా తీసుకొచ్చిన చట్టం ధరణీ. ధరణీతో రైతులు ఘోసలు పడ్డారు. ధరణీ పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. ధరణీ సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారు. చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా వారి సమస్యలు పరిష్కారం కాలేదు. అన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా సొంతంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పొంగులేటి వెల్లడించారు.