మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన రేవంత్కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేసీఆర్.. ఇంకా ఈ రాష్ట్రానికి తానే సీఎం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం పూర్తిగా బంద్ అవుతుందని జోస్యం చెప్పారు.
ఇతర పార్టీల నేతలు ఏం చూసి బీఆర్ఎస్లోకి వస్తారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల పాలైన రాష్ట్రంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మారాలంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యమని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే నీలం మధు గెలవాలని పేర్కొన్నారు. నీలం మధును గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారన్న మంత్రి పొంగులేటి.. రెండుసార్లు అవకాశం వచ్చినా ప్రధాని పదవి రాహుల్ తీసుకోలేదని వెల్లడించారు.