ఫ్రీ బస్సు ప్రయాణం గురించి మోదీ అలా మాట్లాడటం సరికాదు : మంత్రి పొన్నం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన పథకం మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కు ఇప్పటికే మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈ పథకంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఇలా చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చవద్దని హితవు పలికారు.

“కొన్ని రాష్ట్రాలు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. ఆర్టీసీలో ప్రయాణానికి .. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు. ఇప్పటికి కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇంకా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడటం సరికాదు. ఇలా చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చవద్దు.” అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news